క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ మరోసారి దూసుకెళ్లింది. ఒక్కో బిట్ కాయిన్ విలువ (bitcoin record Price) తాజాగా 40 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగే అవకాశాలు కనిపించడంతో స్టాక్ మార్కెట్లతోపాటు, క్రిప్టో కరెన్సీల విలువ కూడా దూసుకుపోతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడం కూడా మార్కెట్లకు కలసివచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్లలో వచ్చే నెల నుంచి కోత మొదలవుతుందనే అంచనాలు బిట్ కాయిన్ ధర పెరగడానికి దారితీశాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవాళ ఉదయం బిట్ కాయిన్ విలువ ఒకేసారి నాలుగు శాతం పెరిగి 40950 డాలర్లకు చేరింది. గడచిన ఏడు రోజుల్లోనే బిట్ కాయిన్ విలువ 10 శాతం పెరగడం గమనార్హం. మరో క్రిప్టో కరెన్సీ ఇథేరియం ఒక్క రోజులోనే 3.3 శాతం పెరిగింది. వారంలో 8.5 శాతం పుంజుకుంది. 2023లోనే బిట్ కాయిన్ విలువ 146 శాతం పెరిగింది. అమెరికాకు చెందిన బ్లాక్ రాక్ కంపెనీ స్పాట్ బిట్ కాయిన్ ఈటీఎఫ్ ప్రారంభించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. జనవరిలో అనుమతి లభించే అవకాశముందని తెలుస్తోంది.