BJP huge victory in Rajasthan
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో కమలం ఇతోధికంగా,
శతాధికంగా వికసించింది. 199 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ 115 స్థానాలు గెలుచుకుంది. అంతకుముందు అధికారంలో
ఉన్న కాంగ్రెస్ పార్టీ 69 స్థానాలకు పరిమితమైంది.
రాజస్థాన్‌లో గత మూడు దశాబ్దాలుగా ఒక ట్రెండ్
కొనసాగుతోంది. అక్కడి ఓటర్లు ప్రతీ ఎన్నికలోనూ అధికార పక్షాన్ని మారుస్తున్నారు. ఆ
ట్రెండ్‌ను బద్దలుగొట్టి, రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్
భావించింది. కానీ అది సాధ్యం కాలేదు.
అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్
ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కాంక్షతో పలు సంక్షేమ పథకాలను
ప్రకటించింది. అయినా ప్రజలు ఆ ఉచ్చులో పడలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి నేతలు విస్తృతంగా చేసిన ప్రచారం ఫలితాన్నిచ్చింది.
కమలదళాన్నే రాజస్థానీ ప్రజలు విశ్వసించారు. ఆ విషయాన్ని గ్రహించిన అశోక్ గెహ్లాట్
ఓటమిని అంగీకరిస్తూ ‘ఎక్స్’లో ట్వీట్ చేసారు.
‘‘రాజస్థాన్ ప్రజల తీర్పును వినయంగా
ఆమోదిస్తున్నాం. ఇది మాకు అనూహ్యమైన ఫలితం. మా ప్రణాళికలు, సృజనాత్మక ఆలోచనలను
ప్రజల ముందుకు తీసుకువెళ్ళడంలో మేము పూర్తిగా విజయవంతం కాలేదని ఈ పరాజయం
తెలియజేసింది’’ అని గెహ్లాట్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన గవర్నర్ కల్రాజ్
మిశ్రాకు తన రాజీనామా సమర్పించారు.
రాజస్థాన్ శాసనసభలో 200 స్థానాలున్నాయి. శ్రీగంగానగర్
జిల్లా కరణ్‌పూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మీత్‌సింగ్ కూనార్ మరణించడంతో
ఎన్నిక వాయిదా పడింది. మిగతా 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 115 సీట్లు
బీజేపీ గెలుచుకుంది, కాంగ్రెస్ 69 స్థానాల్లో గెలిచింది.
సాధారణంగా బీజేపీ-కాంగ్రెస్… రెండు పార్టీలకు
పరిమితమైన రాజస్థాన్‌లో ఈసారి చిన్న పార్టీలు ఉనికి చాటుకున్నాయి. భారత ఆదివాసీ
పార్టీ 3 స్థానాలు, బహుజన సమాజ్ పార్టీ 2 స్థానాలు గెలిచాయి. రాష్ట్రీయ
లోకతాంత్రిక్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ చెరో ఒక స్థానం సాధించాయి. 8 స్థానాల్లో
స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. మొత్తంగా 15 స్థానాలు ఇతరులు సాధించగలిగారు.
ఓట్ల శాతం చూస్తే బీజేపీకి 41.69శాతం ఓట్లు పోల్
అయ్యాయి. కాంగ్రెస్‌కు 39.53శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే రెండు పార్టీల మధ్యా 2శాతం
కంటె ఎక్కువ తేడా ఉంది. గత ఎన్నికల్లో ఆ తేడా ఒక శాతం కంటె తక్కువ ఉంది.
గత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది, బీజేపీకి
70 మంది ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి 3, సీపీఎం 2,
భారతీయ ఆదివాసీ పార్టీ 2, రాష్ట్రీయ లోక్‌దళ్ 1, స్వతంత్రులు 13మంది ఉన్నారు. ఉదయ్‌పూర్,
కరణ్‌పూర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
బీజేపీ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత
రాలేదు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ, కమలం పువ్వు గుర్తే ముఖ్యమంత్రి
చిహ్నమని ఆలంకారికంగా చెప్పారు. ఇప్పుడు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి
అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది.
మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝాల్రాపాటన్
నియోజకవర్గం నుంచి 53,193 ఓట్ల తేడాతో గెలిచారు. జైపూర్ రూరల్ ఎంపీ, మాజీ
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ ఝోట్వారా నియోజకవర్గం నుంచి 50,167 ఓట్ల
ఆధిక్యంతో గెలిచారు. వీరిద్దరూ సీఎం రేసులో ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,
కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్‌రామ్ మేఘ్వాల్ కూడా బరిలో
ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జోధ్‌పూర్
జిల్లాలోని సర్దార్‌పురా నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అయితే ఆయన ఓట్ల
మార్జిన్ గణనీయంగా తగ్గింది. గత ఎన్నికల్లో 45,597 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన అశోక్
గెహ్లాట్, ఈసారి కేవలం 26,396 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి మహేంద్ర
రాథోడ్‌ను గెహ్లాట్ ఓడించారు.
అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలోని పలువురు
మంత్రులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న
మంత్రి గోవిందరామ్ మేఘ్వాల్ స్వయంగా ఓడిపోయారు. మిగతా మంత్రివర్గంలో భన్వర్ సింగ్
భాటీ, శకుంతలా రావత్, విషయేంద్ర సింగ్, రమేష్ చాంద్ మీనా, షాలే మహమ్మద్, ఉదయ్‌లాల్
అంజానా ఓటమి పాలయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ కూడా ఓడిపోయారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీ రెండు
పార్టీలూ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడ్డాయి. అయితే కాంగ్రెస్ కుమ్ములాటలు బాగా
బహిర్గతమయ్యాయి. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడం అశోక్ గెహ్లాట్ సర్కారుకు
పెద్ద దెబ్బగా నిలిచింది. ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం ఇరువర్గాల మధ్యా రాజీ
కుదర్చగలిగింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.
కాంగ్రెస్ హయాంలో జరిగిన మతఘర్షణలను బీజేపీ
బలంగా ప్రచారం చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలకు
పాల్పడుతోందంటూ బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది. ఇంక అధికార పార్టీ
అవినీతి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం వంటి అంశాలను కూడా బీజేపీ ప్రముఖంగా
ప్రచారం చేసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ సంక్షేమ
పథకాలతో వరాల జల్లు కురిపించింది. తూర్పు రాజస్థాన్ కాలువ ప్రాజెక్టు గురించి
భారీగా ప్రచారం చేసుకుంది. ఆ పథకానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జాతీయ
హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పిందని కూడా ప్రచారం చేసింది. అయినా కాంగ్రెస్ పార్టీని
సగటు రాజస్థానీ ఓటరు విశ్వసించలేదు.