మిగ్ జాం తుఫాను ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాను, ఇవాళ మరింత బలపడనుంది. సోమవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య దివిసీమ సమీపంలో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం ఏపీపై తీవ్రంగా పడనుంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (cyclone alert) కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మిగ్ జాం తుఫాను నెల్లూరుకు 340 కి.మీ, బాపట్లకు 420 కి.మీ, మచిలీపట్నానికి 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశ ముందని ఐఎండీ అంచనా వేసింది. తీరంలో గంటలను 90 నుంచి 110 కి.మీ వేగంలో పెనుగాలులు వీచే అవకాశ ముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు.
గడచిన 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.