ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం తెలంగాణలో మాత్రమే సత్తా చాటడంతో ఇండియా కూటమి (india alliance) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే సానుకూల ఫలితాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ కూటమి దృష్టి సారించనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించేందుకు డిసెంబరు ఆరో తేదీన ఇండియా కూటమి అత్యవసరంగా సమావేశం కానుంది.
ఇండియా కూటమిలోని కీలక నాయకులు డిసెంబరు ఆరో తేదీన ఢిల్లీలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే అందరికీ సమాచారం అందించారు. కొందరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు. మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఇండియా కూటమి వైఫల్యంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.