కాంగ్రెస్
ముఖ్యనేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా కన్నడ ప్రభుత్వంలోని పదిమంది
మంత్రులు హైదరాబాద్ లో మకాం వేశారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు
చేజారకుండా
చూసే బాధ్యతను కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయనకు అప్పగించింది. దీంతో హైదరాబాద్ లోని
తాజ్ కృష్ణాలో మకాం వేసిన శివకుమార్, ఫలితాల సరళిపై హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్లో
ట్రబుల్ షూటర్ గా పేరున్నశివకుమార్ తన సొంతరాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఇతర
రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సమస్యల్లో పడితే అక్కడి వాలిపోయి ఒడ్డున పడేసేందుకు
ప్రయత్నిస్తారు. కర్ణాటక లో కాంగ్రెస్ విజయం తర్వాత ఆయనే సీఎం అంటూ పెద్ద ఎత్తున
ప్రచారం కూడా జరిగింది. కానీ ఆఖరికి అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ డిప్యూటీ
సీఎంతో సరిపెట్టుకున్నారు.
ప్రస్తుతం
తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నందున అభ్యర్థులు చేజారకుండా చూడటంలో పాటు వర్గపోరు
తలెత్తకుండా చూసే బాధ్యతను కూడా అధిష్టానం ఆయనకే అప్పగించింది.
సీఎం
అభ్యర్థి ఎవరు అనే విషయంపై డీకే శివకుమార్ స్పందించారు. ‘‘రేవంత్ రెడ్డే
ముఖ్యమంత్రి అవుతారా’’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ విషయం అధిష్టానమే వెల్లడించాలన్నారు.
తుదపరి కార్యాచరణపై అధినాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు.
కేసీఆర్,
కేటీఆర్ లకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని మరో ప్రశ్న వేయగా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే
తగిన సమాధానం చెప్పారన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత బీఆర్ఎస్ నేతలు
పెట్టిన అన్ని ట్విట్లకు బదులిస్తామన్నారు.
పీసీసీ
చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళి మర్యాదపూర్వకంగా
భేటీ అవ్వడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతోనే
డీజేపీ వెళ్లారన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానో లేనో ఇప్పుడు చెప్పడం సరికాదంటూ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.