రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో రుణాల మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలతో, రైతుల పేరుతో ఐడీబీఐ బ్యాంకు నుంచి కొందరు రూ.311 కోట్లు కాజేశారు. ఇటీవల సీబీఐ హైదరాబాద్‌లో జరిపిన సోదాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉద్యోగాల పేరుతో యువత నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన ముఠా, ఐడీబీఐ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డులతో భారీగా రుణాలు తీసుకున్నారు. ఆ తరవాత ఆ నిధులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. బ్యాంకు నుంచి తీసుకున్నరుణాలతో ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారు. వ్యాపారాలు ప్రారంభించారు. గత నెలలో సీబీఐ దాడుల్లో విషయం వెలుగుచూసింది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్థిర, చరాస్తులు సీజ్ చేశారు. అయితే నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.