Cyclone ‘Michaung’: బంగాళాఖాతంలో
ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,
పుదుచ్చేరిలో భారీ నుంచి అతీ భారీ వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(IMD)
తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు (RAIN ALERT)వానలు
కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా
ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు వేటను వాయిదా వేసుకుని సురక్షిత
ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.
ఆదివారం నాటికి తుపానుగా బలపడి, ఆపై
వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది.
ఐదో తేదీ ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశ ఉంది.
రానున్న
రెండు రోజులు గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల , తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90
కిలోమీటర్లు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ
శాఖ అధికారులు తెలిపారు.
భారీ
వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చీఫ్ సెక్రటరీ జవహర్
రెడ్డి తుపాను పై సమీక్ష నిర్వహించి తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం
చేశారు. జిల్లాల స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో నిత్యావసరాలకు లోటు
లేకుండా పౌరసరఫరాల విభాగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తుపాను
నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజల
సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ సంప్రదించవచ్చు
అని చెప్పారు. 1070, 112, 18004250101 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు
అని వివరించారు.