ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం (israel hamas ceasefire) ముగియగానే మరలా భీకరదాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో తాజాగా 178 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరినా ఇజ్రాయెల్ పట్టించుకోలేదు.ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు హమాస్ ప్రకటించింది. వైమానిక దాడులతో గాజాలోని ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
అక్టోబర్ 24న ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో వారం పాటు దాడులు నిలిచిపోయాయి. మొదట నాలుగు రోజులు, తరవాత మరో రోజు పొడిగించుకోవడంతో దాదాపు ఆరు రోజులు దాడులు ఆపివేశారు. కాల్పుల విరమణ గడవు శుక్రవారం ముగియగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలు పెట్టింది.
హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 138 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని ఐడీఎఫ్ ప్రతినిధి డానియెల్ హగారీ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ 100 మంది బందీలను విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.