హోరాహోరీగా
జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
సరళిపై పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా
మారాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్
పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్
పోల్స్ అంచనా వేయగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ కే మొగ్గు ఉందని
వెల్లడించాయి.
మిజోరంలో
ప్రాంతీయ పార్టీల మద్య గట్టిపోటీ ఉన్నట్లు జోస్యం చెప్పాయి.ఈ అంచనాలు నిజమవుతాయా, ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారతాయా, ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది
తేలాలంటే డిసెంబరు 3 వరకు ఆగాల్సిందే.
తెలంగాణలో
ఓటర్ల నాడిపై సీఎన్ఎన్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం హస్తం పార్టీకే
అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు 56
సీట్లు వస్తాయని అంచనా వేస్తోన్న సీఎన్ఎన్, బీఆర్ఎస్
48 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం
అవుతోందని అంచనా వేసింది. తమ లెక్కల ప్రకారం బీజేపీకి 10, ఎంఐఎంకు 5 సీట్లు వస్తాయని వెల్లడించింది.
సీ ప్యాక్
సర్వే కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ కు 65, బీఆర్ఎస్ కు 41 సీట్లు వచ్చే అవకాశం ఉందని
ప్రకటించింది.
ఆరా
మస్తాన్ సంస్థ కూడా తాము నిర్వహించిన ప్రీపోల్ సర్వే కూడా కాంగ్రెస్ కే ఛాన్స్
ఉందని చెబుతోంది. హస్తంపార్టీని ప్రజలు నమ్మారని ఆ పార్టీకే అధికారం ఇస్తారని
చెబుతోంది. ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగాయనేది ఆ సర్వే సారాంశం. కాంగ్రెస్ కు 58 నుంచి 67 స్థానాలు, బీఆర్ఎస్ కు 41 నుంచి 49 స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. బీజేపీకి 5 నుంచి 7 సీట్లు వస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు ఘంటాపథంగా చెబుతున్నారు. చంద్రబాబు
అరెస్టు ప్రభావం బీఆర్ఎస్ పై పడిందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
పల్స్
టుడే, చాణక్య స్ట్రాటజీస్, న్యూస్ 18 సర్వే కూడా కాంగ్రెస్‌దే
అధికారమని అంచనా వేస్తుండగా థర్డ్ విజన్ సర్వే మాత్రం బీఆర్ఎస్ హ్యాట్రిక్
కొడుతుందని చెబుతోంది.
రాజస్థాన్
లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ నెంబర్ 100 మార్క్ దాటితే ప్రభుత్వం ఏర్పాటు
అవుతుంది. ఈ సారి అక్కడ బీజేపీకే అవకాశం
ఉందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
పీపుల్స్
పల్స్ సర్వే సంస్థ బీజేపీకి 95
నుంచి 115 సీట్లు వస్తాయని అంచనా వేస్తుండగా, కాంగ్రెస్ కు 73-95 స్థానాలకే పరిమితం అవుతుందని
చెబుతోంది.
ఇండియా టుడే సర్వే మాత్రం కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేస్తోంది. బీజేపీ కి 55 నుంచి 72 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ 18, రిపబ్లిక్ టీవీ, జన్‌కీబాత్, టీవీ9 భారత్ వర్ష్ పోల్ స్ట్రాటజీ మాత్రం బీజేపీ దే అధికారం
అంటున్నాయి.
ఛత్తీస్ గఢ్
ఎగ్జిట్ పోల్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం
నిలబెట్టుకుంటుందని అంచనా వేస్తున్నాయి.
చత్తీస్‌గఢ్ లో 90 శాసనసభ స్థానాలు ఉండగా, బీజేపీ 29 నుంచి 39 స్థానాలకు పరిమితం అవుతుందని, కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 64 వరకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి.
పీపుల్స్
పల్స్ సర్వే మేరకు బీజేపీకి 29
నుంచి 39 స్థానాలు దక్కే అవకాశం ఉండగా
కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 64 వరకు సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీకి 36
నుంచి 46 సీట్లు, కాంగ్రెస్ కు 40
నుంచి 50 సీట్లు వస్తాయట.
సీఎన్ఎన్, న్యూస్ 18 ఫలితాలు కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్
లో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ
కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ జరిగింది.
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనాల మేరకు కాంగ్రెస్-117 నుంచి 139లో మొగ్గు ఉండగా బీజేపీ 91
నుంచి 113 స్థానాల్లో మాత్రమే ప్రభావం
చూపుతుందని తేలింది. న్యూస్ 18
సర్వే ప్రకారం బీజేపీ కి112,
కాంగ్రెస్ కు 113 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది.సీఎన్ఎన్
సర్వే కూడా బీజేపీ కే అనుకూలంగా పలితాలు ఉంటాయని
చెబుతోంది. బీజేపీ116 చోట్ల గెలుస్తందని కాంగ్రెస్
అభ్యర్థులు 111 చోట్ల విజయం సాధిస్తారని తెలిపింది. జన్ కీ బాత్ సర్వే, బీజేపీకి 100 నుంచి 123, కాంగ్రెస్ కి 102
నుంచి 125 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది.
మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)
మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం)
పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. మిజోరాంలో 40 శాసనసభ స్థానాలు ఉన్నాయి.