బ్యాంకులో కుదువ పెట్టిన బంగారం (crime news) జాగ్రత్తగా ఉంటుందని నమ్మితే జనం మోస పోకతప్పదు. బ్యాంకుల్లో కూడా బంగారానికి భద్రత కరవైంది. అత్యవసరాల కోసం బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని, కొందరు సిబ్బంది కాజేయడం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా గార స్టేట్ బ్యాంక్‌లో ఖాతాదారులు తనఖా పెట్టిన 7 కేజీల బంగారం మాయమైంది. బ్యాంకులో పనిచేసే సిబ్బంది చేతివాటంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు మహిళా ఉద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
గార స్టేట్ బ్యాంక్‌లో అప్పుల కోసం కుదవ పెట్టిన బంగారం, రుణం చెల్లించినా తిరిగి ఇవ్వకపోవడంతో గుట్టురట్టైంది. నగలు గల్లంతయ్యాయని ప్రచారం జరగడంతో ఖాతాదారులు పోటెత్తారు. ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో రుణాలు అందించే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ నవంబరు 23న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఖాతాదారుల అనుమానం మరింత పెరిగింది. రూ.4 కోట్ల విలువైన 7 కేజీల బంగారం కనిపించడం లేదని బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.