WEATHER
WARNING: ఆంధ్రప్రదేశ్
తో పాటు తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన
అల్పపీడనం తుఫానుగా బలపడనుంది. దీంతో కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు
కురవబోతున్నాయని వాతావరణ శాఖ(IMD)
హెచ్చరించింది. మిచౌంగ్ గా ఈ తుఫానుకు పేరు పెట్టారు. ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే
విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
డిసెంబర్3,5 తేదీల మధ్య దక్షిణ ఒడిశా,
ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా
వేస్తోంది. భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా
వేస్తున్నారు.
కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల
వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని చెప్పారు.
తమిళనాడు, పుదుచ్చేరిల్లో నేటి నుంచి సోమవారం వరకు వానలు కురుస్తాయని అప్రమత్తంగా
ఉండాలని హెచ్చరించారు.