Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏర్పడిన
తాత్కాలిక సంధి గడువును మరోసారి
పొడిగించారు. మరికొద్ది సేపట్లో సంధి సమయం ముగుస్తుందనగా కాల్పుల విరమణ
ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరువర్గాలు సమ్మతించాయి.
ఎన్ని రోజుల పాటు విరామం ఉంటుందనే
విషయంపై స్పష్టత లేనప్పటికీ ప్రస్తుతానికి
సైనిక చర్యను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
బందీలను
విడుదల చేసే ప్రక్రియను కొనసాగించేందుకు మధ్యవర్తల ప్రయత్నాలకు లోబడి, కాల్పుల
విరమణను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సంధిని పొడిగించేందుకు హమాస్ కూడా ఎలాంటి అభ్యంతరాలు
తెలపలేదని పేర్కొంది.
చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ కూడా ఈ విషయాన్ని
ధృవీకరించింది.
సంధి మేరకు హమాస్ రోజుకు 10 మంది బందీలను విడుదల
చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు హమాస్ మొత్తం 97మంది బందీలను వదిలిపెట్టగా,
ఇజ్రాయెల్ 210 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసింది.