భారత స్టాక్ మార్కెట్లు (stock market capitalization) ఇవాళ సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభపడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లలో మదుపరుల పెట్టుబడుల విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే 333.25 లక్షల కోట్లకు చేరింది. స్టాక్ మార్కెట్ సంపద ఈ స్థాయికి చేరడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది మొత్తం 5540 పాయింట్లు పెరిగింది. 9.10 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్కెట్ పెట్టుబడుల విలువ ఈ ఏడాది 50 లక్షల కోట్లు పెరిగింది. 2021 మే 24 నాటికి భారత్ స్టాక్ మార్కెట్ల సంపద 3 ట్రిలియన్లుగా నమోదైంది. తాజాగా పెరిగిన విలువతో భారత్… అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ సరసన చేరింది.