ఖలిస్థానీలపై సిఖ్స్ ఫర్ అమెరికా (sikhs for america) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలోని గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూను ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకోవడంపై సిఖ్స్ ఫర్ అమెరికా విభాగం తీవ్రంగా ఖండించింది. ఆందోళనకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గురుద్వారాలు ప్రార్థనా మందిరాలని, వాటిని రాజకీయ అభిప్రాయాలకు వేదికలు చేయవద్దని కోరింది.
అమెరికాలోని న్యూయార్క్ గురుద్వారాలో భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్‌ను గత వారం కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి వారంతా గురుద్వారా సాహిబ్ శాంతి, పవిత్రతలను ఉల్లంఘించిన వారవుతారని సిఖ్స్ ఫర్ అమెరికా విభాగం హెచ్చరించింది. ప్రార్ధనా మందిరాలకు భక్తులు భయం లేకుండా వచ్చేలా, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. రాజకీయ అభిప్రాయాలకు గురుద్వారాలను దూరంగా ఉంచాలని కోరింది.