ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించే ప్రక్రియ చివరి దశకు (tunnel trapped workers) వచ్చింది. మరో 2 మీటర్లు తవ్వితే కార్మికులను వెలికితీయడం సాధ్యం అవుతుంది. అమెరికా నుంచి తెచ్చిన డ్రిల్లింగ్ మెషీన్ మొరాయించడంతో బొగ్గు గనుల్లో బొరియలు చేసుకుంటూ తవ్వకాలు చేసే నిపుణులను రంగంలోకి దింపారు. 12 మంది నిపుణులైన కార్మికులు వడివడిగా తవ్వకాలు చేస్తున్నారు.
మరో 2 మీటర్లు తవ్వితే సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడం సాధ్యం అవుతుందని మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ వెల్లడించారు. మరోవైపు కొండపై భాగం నుంచి కూడా బోర్ తవ్వకాలు చేస్తున్నారు. సాయంత్రానికి కార్మికులను వెలికితీస్తామని వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుంటే ఇవాళ సాయంత్రం కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసే అవకాశముంది.