తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (telangana elections) నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పెద్ద మొత్తంలో ఒకేసారి ఎస్ఎంఎస్లు పంపడం, అసభ్యకర, రెచ్చగొట్టే, రాజకీయపరమైన వాటిపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఇలాంటి వాటిపై నిఘా పెట్టినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 48 గంటలపాటు ఎస్ఎంఎస్లు నిలిపివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ సూచనలు, ఆదేశాలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ఈసీ హెచ్చరించింది. భారత శిక్షాస్మృతి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలుంటాయని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఎస్ఎంఎస్లు పంపితే వాటికి అయ్యే వ్యయం కూడా అభ్యర్ధుల ఖర్చులోకి వస్తుందని ఈసీ తెలిపింది. ఎల్లుండి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.