పార్లమెంటు
శీతాకాల సమావేశాల నిర్వహణపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. సమావేశాలు
డిసెంబర్ 4న ప్రారంభం అవుతుండగా అఖిలపక్ష నాయకులతో డిసెంబర్ 2న సమావేశం నిర్వహించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్
4 నుంచి 22 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో
పలు కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ ప్రతినిధిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీలనేతలను
సమావేశానికి ఆహ్వానించారు.
సమావేశాల
ప్రారంభం ముందురోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం అనవాయితీ. అయితే ఈ సారి రెండురోజుల
ముందే నిర్వహించాల్సి వస్తోంది.
ఐదు
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3న ఉండటంతో డిసెంబర్ 2నే ఆల్ పార్టీ
మీట్ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం
నిర్ణయించింది.
తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,
మిజోరాం ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే పార్లమెంటు సమావేశాలు
ప్రారంభమవుతున్నాయి. దీంతో ఆ ఫలితాల ప్రభావం ఉభయ సభల్లో ప్రతిధ్వనించే అవకాశముంది.
ఈ సమావేశాల్లో భారత శిక్షాస్మృతి(ipc), నేర
శిక్షా స్మృతి(crpc),
సాక్ష్యాధార చట్టాల(evidence act)ల
స్థానంలో నూతన బిల్లుల ఆమోదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వలస పాలనకు ఆనవాళ్లుగా
ఉన్న ఈ చట్టాల స్థానంలో భారతీయతను తెలియజేసేలా కొత్త చట్టాలు కేంద్రప్రభుత్వం
తీసుకొస్తోంది.