భారతీయ పర్యాటకులకు మలేషియా (malaysia visa) బంపరాఫర్ ప్రకటించింది. ఇక నుంచి మలేషియా సందర్శించే పర్యాటకులకు వీసా అవసరం లేదని స్పష్టం చేసింది. డిసెంబరు 1 నుంచి భారత్, చైనా పౌరులకు ఈ అవకాశం కల్పించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు.
ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే పర్యాటక రంగం అభివృద్ధి తప్పనిసరని మలేషియా ప్రధాని అభిప్రాయపడ్డారు. తమ దేశంలో చైనా, భారత్ పర్యాటకులు నెల రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండానే పర్యటించవచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. పెట్టుబడులు పెట్టేవారి వీసా సదుపాయాలను కూడా మెరుగుపరచనున్నట్లు ప్రధాని తెలిపారు.