తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రధాని
నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఉదయం
నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధానికి
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,
ఈవో, అర్చకులు స్వాగతం పలికారు.
ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని, ధ్వజ స్తంభానికి మొక్కిన అనంతరం మూలవిరాట్టును
దర్శించుకున్నారు. హుండీలో కానుకలను సమర్పించారు.
రంగనాయకుల మండపంలో అర్చక స్వాములు వేదాశీర్వచనం
అందజేశారు. మోదీ ఆలయంలోనే దాదాపు 50
నిమిషాలు గడిపారు. ప్రధాని హోదాలో మోదీ, తిరుమలేశుడిని
దర్శించుకోవడం నాలుగోసారి.
ప్రధాని మోదీకి టీటీడీ ఛైర్మన్ భూమన
కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్ లను
అందించారు.
ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు.
ప్రధాని ఆదివారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, డీప్యూటీ సీఎం నారాయణ స్వామి, పలువురు
మంత్రులు ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు.