తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్న ప్రధాని మోదీ, త్వరలో
అది సాకారం అవుతుందని ఆకాంక్షించారు. తెలంగాణ అతి పురాతన పట్టణాల్లో ఒకటైన తూప్రాన్
లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, అక్కడ బహిరంగ సభ వేదికగా ప్రజలను
ఉద్దేశించి మాట్లాడారు.
నాచారం లక్ష్మీనరసింహా స్వామి స్మరణతో మోదీ తన ప్రసంగాన్ని
ప్రారంభించారు.
‘‘
నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు’’ అని అనగానే ప్రజలు హార్షాతిరేకాలు
వ్యక్తం చేశారు. తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ ఆయన
తెలుగులో చెప్పారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు సంకల్పించారని అన్నారు.
సకల
జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం బీజేపీ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, కమలం వికసించడం
ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్
అధినేత కేసీఆర్, తెలంగాణ తన జాగీరు అనుకుంటున్నారని విమర్శించిన మోదీ, కేసీఆర్ పై
బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్ అధినేతకు ఓటమి భయం
పట్టుకుందన్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఓటమి భయంతోనే అమేథిని వదిలి వాయనడ్ కు
వలసపోయారని ఎద్దేవా చేశారు.
వ్యవసాయదారుల
సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ ను ఈ ప్రాంత రైతులతో పాటు మల్లికార్జున స్వామి
కూడా రక్షించలేరన్నారు. ప్రజలను కలవని, సచివాలయానికి రాని ముఖ్యమంత్రి తెలంగాణకు
అవసరమా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్,
బీఆర్ఎస్ పార్టీల వారసత్వ రాజకీయాలతో వ్యవస్థ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసిన
మోదీ, ఇరు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. కుటుంబ పార్టీలు తమ
వారసుల గురించి మాత్రమే ఆలోచిస్తాయని విమర్శించారు.
బీజేపీతోనే
సామాజిక న్యాయం సాధ్యమన్న మోదీ, అధికారమిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామనే
వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని తమ పార్టీ అర్థం
చేసుకుందని త్వరలో వారికి కూడా న్యాయం చేసేందుకు
ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణను
దోచుకున్న కేసీఆర్, దేశాన్ని లూటీ చేసేందుకు దిల్లీకి వెళ్లి అక్కడి నేతలతో చేతులు
కలిపి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టిన మోదీ, రైతులను మోసం చేయడంలో
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలన్నారు.
తెలంగాణ
అభివృద్ధి కోసం, కమలం గుర్తుపై ఓటు వేసి భారతీయ జనతాపార్టీ అభ్యర్థులను
గెలిపించాలని పిలుపునిచ్చారు.