15 years after
26/11: సరిగ్గా 15 ఏళ్ళ కిందట ఇదే
రోజున దేశ ఆర్థిక రాజధానిపై పాకిస్తాన్కు చెందిన ముష్కర ముఠా దాడి చేసి
అల్లకల్లోలం సృష్టించి 18 మంది భద్రతా సిబ్బందితో పాటు 166 మంది సామాన్యపౌరులను
పొట్టనబెట్టుకున్న దుర్దినం. అత్యంత అమానుషంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు పోలీసు,
ఆర్మీతో పాటు సామాన్యపౌరులను తమ బుల్లెట్లుకు బలితీసుకున్నారు.
దశాబ్దన్నరం కిందట
ముంబైలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనను తలచుకుని పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు.
పాకిస్తాన్
ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపిన ఈ విచాక్షణా రహిత కాల్పుల్లో మెరికలు లాంటి
భారతీయ సైనికాధికారులతో పాటు నిజాయితీగల పోలీసు అధికారులను భారతజాతి కోల్పోయింది.
గుజరాత్
లోని అరేబియా సముద్రతీరం ద్వారా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది
ఉగ్రవాదులు, 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్లో చొరబడి కాల్పులకు తెగబడ్డారు.
ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు
జరపడంతో పాటు గ్రెనేడ్ లు విసిరారు.
నాలుగు రోజుల పాటు జరిగిన మారణహోమంలో 9 మంది ముష్కరులను హతమార్చిన భద్రతా
దళాలు మరో ఉగ్రవాది కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు.
తుకారం
ఓంబ్లే కసబ్ ను పట్టుకున్నారు. అతని ధైర్య సాహసాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అశోకచక్రను
ప్రదానం చేసి గౌరవించింది.
విచారణలో
తాను పాకిస్తానీ పౌరుడిని అని ఒప్పుకున్న కసబ్, మారణహోమం సృష్టించేందుకే భారత్లో
అడుగుపెట్టినట్లు చెప్పాడు. రెండేళ్ళ తర్వాత పూణేలోని ఓ జైలులో భారీ భద్రత నడుమ కసాయి
కసబ్ ను ఉరి తీశారు.
26/11
నాటి దారుణమైన ఉగ్ర ఘటనను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నేటి
మన్ కీ బాత్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని, నాడు జరిగిన దాడితో
ముంబైతో పాటు మొత్తం దేశమే బెంబేలెత్తిపోయిందన్నారు. ఉగ్రదాడి జరిగి 15 ఏళ్ళు అయిన
సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని, అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి
మరిచిపోదన్నారు. నాటి దాడి నుంచి పూర్తి సామర్థ్యంతో కోలుకున్న భారత్, ధైర్య
సాహసాలతో ఉగ్రవాదాన్ని అణచివేస్తోందన్నారు.
26/11
అమరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలిపారు.
దాడుల్లో మరణించిన భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలు, ఉగ్రవాదంపై పోరులో పౌరులకు
స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.