ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కొండపై నుంచి నిలువుగా బోరు తరహాల్లో తవ్వకాలు మొదలు పెట్టారు. సల్క్యారా సొరంగంలో (silkyara tunnel) ఈ నెల 12 నుంచి చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు నిలువునా బోరు వేసేందుకు రెండు ప్రదేశాలను గుర్తించారు. సొరంగం ఉన్న కొండపై భాగం నుంచి ఈ బోర్లు తవ్వనున్నారు.
ప్రభుత్వరంగ సంస్థ ఎస్జేవీఎన్ ఈ తవ్వకాలు మొదలు పెట్టింది. ప్లాన్ బి లో భాగంగా కొండపై మరో ప్రాంతం నుంచి కూడా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. 15 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. తాజాగా డీఆర్డివో పంపిన పరికరాలు కూడా సొరంగం ప్రదేశానికి చేరుకున్నాయి.
కార్మికులను రక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ సొరంగం కూలిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సొరంగం కూలిపోవడానికి అవకాశం లేదని, కానీ అలా జరగడంపై దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. కఠినమైన రాతిపొరలు కలిగిన కొండ సొరంగం కూలిపోవడంపై ఆర్నాల్డ్ డిక్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.