ప్రముఖ నటుడు
ప్రకాశ్‌రాజ్(PRAKASH RAJ)కు ఈడీ(ED summons ) సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ, మోసానికి సంబంధించిన
నగదు అక్రమ చలామణి కేసులో భాగంగా నోటీసులు జారీ చేసిన ఈడీ, డిసెంబర్ తొలివారంలో తమ
ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
తమిళనాడులోని
తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెల్లర్స్ కంపెనీకి(Pranav Jewellers) ప్రకాశ్ రాజ్
ప్రచారకర్తగా ఉన్నారు. ఈ కంపెనీ మరికొందరితో కలిసి పలు ఆఫర్లు ప్రకటించింది.
ఎక్కువ రిటర్నులు ఆశజూపి బంగారంపై పెట్టుబడుల రూపంలో రూ. 100 కోట్లు
సమీకరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే పెట్టుబడిదారులకు తిరిగి
చెల్లించడంలో విఫలమయ్యారని, సేకరించిన డబ్బును
షెల్ కంపెనీలకు తరలించారనే ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
ప్రణవ్ జ్యువెలర్స్ కార్యాలయాల్లో ఈడీ జరిపిన తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.
23. 70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను ఈడీ గుర్తించింది. ప్రచారకర్తగా
ప్రకాశ్ రాజ్ కు జరిపిన చెల్లింపులతో పాటు మిగతా ఆర్థిక విషయాలు గురించి
తెలుసుకునేందుకు ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత
వర్గాలు వెల్లడించాయి.