ఉత్తరాఖండ్
లో కూలిన సిల్కియారా సొరంగం సహాయ చర్యలు 13వ రోజుకు చేరుకున్నాయి. చివరి దశ
అడ్డంకులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ
ముందుకు సాగుతున్న సహాయ దళాలు, పరిస్థితులు అనుకూలిస్తే నేటితో ఆపరేషన్ పూర్తి
చేసి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలనే నిశ్చయంతో ఉన్నాయి.
రాత్రి
డ్రిల్లింగ్ పనులకు ఆటంకం ఏర్పడగా నేడు మళ్ళీ మొదలయ్యాయి.
డ్రిల్లింగ్ చేస్తోన్న
ఆగర్ యంత్రానికి సాంకేతిక లోపం తలెత్తడంతో నిన్న రాత్రి పనులకు అంతరాయం ఏర్పడింది.
25 టన్నుల డ్రిల్లింగ్ మిషన్ అమర్చిన ప్లాట్ ఫామ్ కు పగళ్ళు ఏర్పడ్డాయి. దీంతో
సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడింది.
సొరంగం
లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయ దళాలు మైక్రో టన్నెల్ ఏర్పాటు చేస్తున్నాయి. 46.8 మీటర్ల మేర పైపులను
లోనికి పంపారు. మొత్తం 60 మీటర్ల మేర పైపులు టన్నెల్ లోకి వెళితే కార్మికులను
బయటకు తీసుకొచ్చేందుకు వీలు అవుతుంది.
పైపులోకి చక్రాలు అమర్చిన స్ట్రెచర్లు పంపి వాటి ద్వారా కార్మికులను బయటకు
లాగుతారు. దానికి సంబంధించిన మాక్ డ్రిల్లును కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు
ఎన్డీఆర్ఎఫ్ డైరక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు.
సమాంతర డ్రిల్లింగ్ కు అవాంతరాలు ఎదురువుతుండటంతో
ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టారు. అదనంగా యంత్రాలు తెప్పించి బార్కోట్ వైపు
నుంచి డ్రిల్లింగ్ చేస్తున్నారు. 9.10 మీటర్ల మేర ఇప్పటికే డ్రిల్లింగ్ పూర్తి
చేశారు.