తెలంగాణలో బలపడేందుకు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోహరించారు. కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక నమూనాతోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగల్గుతుందని బహిరంగ సభలే వేదికగా తెలంగాణ ఓటర్లకు తెలియజేస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అందజేస్తున్న అవినీతి రహిత పాలనతో భారత్ పేరు విశ్వవ్యాప్తంగా మార్మోగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
పేదల అభ్యున్నత కోసం కేంద్రం అమలు చేస్తోన్న పథకాలు రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రం వాటాను లెక్కలతో సహా ఓటర్లకు వివరించి తమకు రాష్ట్రంలో కూడా పాలకపార్టీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే మిన్నగా బీజేపీ ప్రచారపర్వంలో దూసుకెళుతోంది. ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అగ్రనేతలు, దక్కన్ పీఠభూమిలో తరచూ పర్యటిస్తూ భారీబహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ బీజేపీ నేషనల్ ఛీఫ్ జయప్రకాశ్ నడ్డా నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోనే బస చేసి భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. మిత్రపక్షమైన జనసేనతో కలిసి ఓటర్లతో మమేకం అవుతున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో బస చేస్తోన్న మోదీ, ఆరు బహిరంగసభల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్ర రంగారెడ్డి జిల్లాలో పర్యటించి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆదివారం నాడు కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. అనంతరం దుబ్బాకలో పర్యటించి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపు కోసం ప్రచారం చేస్తారు. అటు నుంచి నిర్మల్ వెళ్ళి మరో సభలో ప్రసంగిస్తారు.
రాత్రికి తిరుమల చేరుకుంటారు.
సోమవారం తిరుమలేశుడి దర్శనం అనంతరం మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి కరీంనగర్ వెళతారు. పర్యటనలో భాగంగా పలు చోట్ల ప్రధాని రోడ్ షోలు కూడా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో మరోసారి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గతం కంటే మరింత ఉధృతంగా ఎన్నికల ప్రచారంలో భాగం అవుతున్నారు. స్థానిక కేడర్ లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో రోడ్ షో నిర్వహిస్తారు.
25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గాల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్న అమిత్‌షా 26న ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్‌నాథ్ సింగ్ మేడ్చల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గంలో నిర్వహించే సభలకు హాజరవుతారు. అనంతరం కంటోన్మెంట్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోకు హాజరవుతారు. అనంతరం జరిగే బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు.