సంక్షేమం,
అభివృద్ధి పథకాల మాటున రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎంపీ
రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ
చేపట్టింది.
సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు సహా 41 మంది ప్రతివాదులకు
హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
రాష్ట్రంలో
అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, దానిపై సీబీఐ తో విచారణ
జరిపించేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.
పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ
శ్రీరామ్ వాదించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతోనే పిటిషన్
వేశారని కోర్టుకు తెలిపారు. తాము పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులు
ధ్వంసం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం లక్ష్మీనారాయణ కోర్టుకు తెలిపారు.
ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా
వేసింది.