ఖలిస్థానీ ఉగ్రవాది సిఖ్స్ ఫర్ జస్టిస్ నాయకుడు గురుపర్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని అడ్డుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు, భారత విదేశాంగ శాఖ అధికారులకు వెల్లడించారు. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది.
అమెరికాలో పన్నూను హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేశామని అమెరికా అధికారులు తెలిపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. ఈ విషయాన్ని భారత అధికారులకు తెలపగా వారు ఆశ్చర్యం వక్యం చేసినట్లు అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే పన్నూ హత్య కుట్ర ఎక్కడ భగ్నం చేశారు. ఎలా చేశారు అనే విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. బాధ్యులకు శిక్ష పడాలని ఆశిస్తున్నట్లు భారత్ ప్రకటించింది.