ఆయుర్వేద
ఉత్పత్తుల సంస్థ పతంజలి(patanjali
ayurveda) పై
కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సంస్థ సహా వ్యవస్థాపకుడు, యోగ గురు రాందేవ్
బాబా అన్నారు. పతంజలి వ్యాపార ప్రకటనలపై
సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
పతంజలి సంస్థకు సర్వోన్నత న్యాయస్థానం
మొట్టికాయలు వేసిందంటూ కొన్ని వార్తా సంస్థలు పేర్కొనడంపై రాందేవ్ బాబా అసహనం
వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తమను మందలించలేదని తప్పుడు ప్రచారం చేస్తే జరిమానా
వేస్తామని చెప్పిందన్నారు. తీర్పును గౌరవిస్తామన్న రాందేవ్ బాబా, తామ ఎలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం లేదన్నారు.
కొంతమంది
వైద్యులు ఓ సమూహంగా ఏర్పడి యోగా, ఆయుర్వేదంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని
ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు తేలితే వెయ్యి కోట్ల జరిమానా విధించాలన్నారు. తప్పు
చేసినట్లు తేలితే మరణశిక్షకు కూడా తాము సిద్ధమన్నారు. కానీ తప్పుడు ప్రచారం చేసే
అసలైన దగాకోరులను కూడా శిక్షించాలని కోరారు.
పతంజలి
సంస్థ విక్రయించే అన్ని ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయని అందుకు సంబంధించిన
ఆధారాలు కూడా ఉన్నాయని వివరించారు.
యోగా
గురువు రామ్‌దేవ్ బాబా సహ వ్యవస్థాపకుడిగా నెలకొల్పిన ఆయుర్వేద సంస్థ పతంజలి
ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమ ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా అనేక
వ్యాధులు నయం అవుతాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు
వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర
పరిణామాలుంటాయని కూడా సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.
పతంజలి తప్పుడు
ప్రకటనలు చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్
వేసింది. దీనిపై విచారించిన అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన
ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.