డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైతే
కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఐటీ శాఖ సహాయ
మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కృత్రిమ మేధ, డీప్‌ఫేక్ వంటి
సాంకేతికతతో సృష్టించే నకిలీ, తప్పుడు సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు
చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బలమైన సాధనమే
అయినప్పటికీ కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు. టెక్నాలజీ సాయంతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి
చేసి.. సమాజంలో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి
అరికట్టేందుకు సామాజిక మాద్యమ సంస్థలతో కేంద్రం సమావేశం కానున్న నేపథ్యంలో రాజీవ్
చంద్రశేఖర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవల సినీతారల డీప్‌ఫేక్
వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం
చేశారు. దీంతో కేంద్రప్రభుత్వం నవంబరు 23, 24న సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో భేటీ కానుంది.