నటుడు
మన్సూర్ అలీఖాన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. హీరోయిన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు
చేసినందుకు గాను పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అలీఖాన్
వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించడంతో పాటు సుమోటోగా విచారణ
చేపట్టింది. మన్సూర్ అలీఖాన్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు
పోలీసులను ఆదేశించింది. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు
నమోదు చేశారు.
పలు సినిమాల్లో విలన్ వేషాలు వేసిన మన్సూర్
అలీఖాన్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించినట్లు తెలిపారు. లియో సినిమాలో కూడా
త్రిషతో అలాంటి సన్నివేశం ఉండాలని ఆశించినట్లు చెప్పారు. కానీ అలాంటి సన్నివేశం
లేకపోవడం బాధించిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపై త్రిష కూడా తీవ్ర అభ్యంతరం
తెలిపారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి వల్లే పరిశ్రమలోని అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం
వ్యక్తం చేశారు.
ఈ
వివాదం పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన మన్సూర్ అలీఖాన్, త్రిషకు క్షమాపణలు చెప్పే
ఉద్దేశం లేదన్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని సమర్థించుకున్నారు. తానేంటో తమిళ
ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందన్నారు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే
చేసినట్లా?’ అని
ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
దక్షిణ
భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) కూడా మన్సూర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
అతడిపై పాక్షిక నిషేధం విధించింది.