సిల్కియారా
సొరంగంలో చిక్కుకున్న నిర్మాణ కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ
చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యాధునిక పరికరాలు, ప్రపంచనిపుణుల సాయంతో 41
మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కేంద్రంతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం
సంయుక్తంగా సహాయ చర్యలు ప్రారంభించాయి.
కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన
అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టారు. సహాయ చర్యల్లో భారత వాయుసేన కూడా
సేవలందిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ నిపుణుడు, ప్రొఫెసర్ ఆర్నాల్డ్
డిక్స్ నేతృత్వంలో మన మైనింగ్ అధికారులు సంఘటనా స్థలంలో ఆరు రకాల ప్రణాళికలతో
ముందుకు సాగుతున్నారు.
కార్మికులు
ఉన్న ప్రాంతానికి నిలువుగా డ్రిల్ చేసేందుకు సహాయ దళాలు పాయింట్ ను గుర్తించాయి.
మట్టి పెళ్ళలు విరిగిపడటంతో డ్రిల్లింగ్
పనులకు అంతరాయం ఏర్పడింది. కొండపైకి
రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో అక్కడి నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేపట్టేందుకు
మార్గం సుగమం అయిందని జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరక్టర్ అన్షు
మాలిక్ తెలిపారు. దాదాపు 350 మీటర్ల మేర రహదారి నిర్మించినట్లు తెలిపారు.
సిల్కియారా, బార్కోట్ వైపు నుంచి సమాంతరంగా సొరంగాలు
తవ్వడం ఇతర ప్రత్యామ్నాయాలుగా అధికారులు ఉంచుకున్నారు.
కార్మికులు ఉన్న ప్రదేశానికి నిన్న
స్టీల్ పైప్ పంపిన సహాయ దళాలు, వారి దగ్గరికి ఓ కెమెరా పంపారు. తద్వారా
అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.
కార్మికులతో మాట్లాడి వారిలో భరోసా నింపారు. వారికి అవసరమైన ఆహారం మందులు పంపారు.
అలాగే బయట నుంచి డాక్టర్లు కార్మకులకు పలు సూచనలు అందజేశారు.
కాల్షియం టాబ్లెట్ వేసుకోవడంతో పాటు ఓఆర్ఎస్ ద్రవాలు ఎక్కువగా తాగాలని,
మెడిటేషన్ చేయడం ద్వారా మరింత మేలు జరుగుతుందని సూచించారు. దాదాపు 11 రోజులుగా సొరంగంలో చిక్కుకుని బయటపడలేక అల్లాడుతున్న
కార్మికులకు నిన్న ఆహారంగా కిచిడీని అందించారు.
సిల్కియారా
నుంచి బార్కోటుకు సొరంగమార్గం తవ్వుతుండగా ఈ నెల 12న మట్టిపెళ్ళలు విరిగిపడటంతో
కార్మికులు చిక్కుకుపోయారు.