యోగా గురువు రామ్‌దేవ్ బాబా సహ వ్యవస్థాపకుడిగా నెలకొల్పిన ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై (patanjali ayuveda) సుప్రీంకోర్టు సీరియస్ అయింది.తమ ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా అనేక వ్యాధులు నయం అవుతాయంటూ తప్పుడు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడా సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. పతంజలి తప్పుడు ప్రకటనలు చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కాలంలో వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్‌దేవ్ బాబా చేసిన దుష్ప్రచారాన్ని ఐఎంఏ పిటీషన్లో ప్రస్తావించింది. ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే ప్రకటనలు వెంటనే ఆపాలని సుప్రీంకోర్టు పంతజలి ఆయుర్వేద కంపెనీని ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తే ప్రతి ఉత్పత్తిపై
కోటి జరిమానా ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
వైద్యులందరూ హంతకులంటూ రామ్‌దేవ్ బాబా విమర్శలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారంటూ గతంలోనే సుప్రీంకోర్టుకు విన్నవించారు. అల్లోపతి వైద్యులను తక్కువ చేస్తూ ఇచ్చే ప్రకటనలను ఐఎంఏ తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. ఆధునిక మందులు వాడుతున్న వైద్యులు కూడా చనిపోతున్నారంటూ పతంజలి ఇస్తున్న ప్రకటనలు ఐఎంఏ తప్పుపట్టింది.
కోవిడ్ సమయంలోనూ టీకాలను పతంజలి కంపెనీ వ్యతిరేకిస్తూ ప్రకటనలు గుప్పించడంపై కూడా ఐఎంఏ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పతంజలి ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రకటనలు నిలిపేయాలని ఆదేశించింది.