Supreme Court Slams AAP led Delhi Govt
ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ
ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ‘రీజినల్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్
సిస్టమ్’ ప్రాజెక్టుకు ఢిల్లీ ప్రభుత్వం చేయవలసిన చెల్లింపులు వారం రోజులలోపే
చేయాలని ఆదేశించింది. అలా చేయకపోతే, ప్రభుత్వం ప్రకటనల మీద పెట్టిన ఖర్చును
ప్రాజెక్టుకు బదలాయిస్తామని హెచ్చరించింది.
ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టులో ఢిల్లీ నుంచి
మీరట్ (ఉత్తరప్రదేశ్), ఆల్వార్ (రాజస్థాన్), పానిపట్ (హర్యానా)లకు సెమీ హైస్పీడ్
కారిడార్లు నిర్మించాలి. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రప్రభుత్వం, మిగతా
రాష్ట్రప్రభుత్వాలూ తాము చేయవలసిన చెల్లింపులు చేసేసాయి. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం
పైసా కట్టలేదు. పైపెచ్చు, ప్రకటనలకు మాత్రం వేయి కోట్లకు పైగా ఖర్చుపెట్టేసింది. ఆ
విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. దాంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేసింది.
ఈ యేడాది జులై 24న జరిగిన విచారణ
సందర్భంగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది, కొద్దిరోజుల్లోనే మొత్తం సొమ్ము అంతా
చెల్లించేస్తామని న్యాయస్థానానికి వెల్లడించారు. దాంతో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్,
సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వంపై చర్యలకు ఆదేశించకుండా సహనం
వహించింది. వారం రోజులలోగా చెల్లింపులు
పూర్తిచేయాలని, లేనిపక్షంలో ప్రకటనల కోసం కేటాయించిన నిధులను ప్రాజెక్టుకు
బదలాయించాలనీ స్పష్టం చేసింది.
జులై 24 నాటి ఆదేశంలో సుప్రీంకోర్టు,
ప్రాజెక్టులోని ఆల్వార్, పానిపట్ కారిడార్లకు ఢిల్లీ ప్రభుత్వం తన వాటా నిధులు
కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలల్లోగా 415కోట్లు
కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇవాళ జరిగిన విచారణలో, ఢిల్లీలోని ఆమ్
ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ ప్రాజెక్టు చెల్లింపులు ఇంకా చేయలేదని
తెలవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విషయంలో ఒక జవాబు దాఖలు చేయాల్సి ఉందని
ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించారు. కానీ కోర్టు ఒప్పుకోలేదు. ‘ఇంకేం
జవాబు, మా ఆదేశాలను మీరు పాటించలేదు’ అంటూ అక్షింతలేసింది.
‘ఎందుకు మీరు చెల్లింపులు చేయలేదు? మీ
ప్రకటనల ఆదాయాన్ని అటాచ్ చేస్తానని ఆరోజే చెప్పాను. ప్రకటనల బడ్జెట్ మీద స్టే
విధిస్తాను’ అని జస్టిస్ కౌల్ మండిపడ్డారు. కనీసం గడువు పొడిగించమని అడగడానికైనా
కోర్టుకు రాలేదని విరుచుకుపడ్డారు. కోర్టు అంటే ఆటలుగా ఉందా అంటూ ఢిల్లీ ప్రభుత్వ
వైఖరి మీద అసంతృప్తి ప్రకటిస్తూ, తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి
కేంద్రప్రభుత్వం, మిగిలిన రాష్ట్రప్రభుత్వాలు తమ వాటా నిధులను ఎప్పుడో
చెల్లించేసాయి. ఢిల్లీ మాత్రం ఒక్క రూపాయి అయినా చెల్లించకుండా వాయిదాలు వేసుకుంటూ
వచ్చింది. అదే సమయంలో, ప్రకటనల కోసం గత మూడేళ్ళలో ఏకంగా 1100 కోట్ల రూపాయలు
చెల్లించింది.
ఈ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఢిల్లీ – మీరట్ ప్రాజెక్టు ఇప్పటికే
నిర్మాణంలో ఉంది. దానికి సంబంధించిన చెల్లింపులు చేస్తామని కేజ్రీవాల్ సర్కారు
ఒప్పుకుంది. మిగతా రెండు ప్రాజెక్టులకూ తమ వద్ద డబ్బులు లేవని, చెల్లింపులకు
చేతులెత్తేసింది.
ఢిల్లీ – మీరట్ లైన్‌కు సంబంధించి
పర్యావరణ పరిహార చార్జీల కింద 500 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలోనే
ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఢిల్లీ – మీరట్ కారిడార్ పొడవు 82.15
కిలోమీటర్లు. దానికయ్యే అంచనా వ్యయం 31,632 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ
నుంచి మీరట్ ప్రయాణ సమయం 60 నిమిషాలకు (ఒక గంట) తగ్గిపోతుంది.