Israel bans LET in
support of India
ముంబైపై ఉగ్రదాడి జరిగి 15 సంవత్సరాలు
పూర్తయిన సందర్భంగా ఆ దాడికి కారణమైన లష్కర్-ఎ-తయ్యబా ఉగ్రవాదసంస్థను నిషేధిస్తున్నట్లు
ఇజ్రాయెల్ ప్రకటించింది. లష్కరే తయ్యబా ఒక భయంకరమైన, గర్హనీయమైన ఉగ్రవాద సంస్థ అని
పేర్కొంది.
లష్కరే తయ్యబాపై ఇజ్రాయెల్ ఈ నిషేధాన్ని
పూర్తిగా స్వీయనిర్ణయంతో విధించింది తప్ప భారత ప్రభుత్వం ఏమీ కోరలేదు. ఇజ్రాయెల్
మొదట అన్ని విధివిధానాలనూ పూర్తి చేసి, అన్ని నియంత్రణలనూ పరిశీలించి పూర్తిగా
నిర్ధారించుకున్న తర్వాతనే తమ దేశం గుర్తించిన అక్రమ ఉగ్రవాద సంస్థల జాబితాలో
లష్కర్-ఎ-తయ్యబాను చేర్చిందని ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ఒక ప్రకటనలో
వెల్లడించింది.
సాధారణంగా తమ దేశం లోపల కానీ, తమ దేశం
సరిహద్దుల వద్ద కానీ కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద సంస్థల జాబితాను ఇజ్రాయెల్
రూపొందిస్తుంది. భారత్‌ను ఆత్మీయ మిత్రదేశంగా భావించే ఇజ్రాయెల్, భారత్ లోపల ఉగ్రదాడులకు
పాల్పడిన లష్కరే తయ్యబాను కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించడం విశేషం.
‘‘ఇజ్రాయెల్ రక్షణ, విదేశాంగ మంత్రులు గత
కొన్ని నెలలుగా సంయుక్తంగా కృషి చేసి, ఈ నిషేధ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చాయి.
ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ప్రాధాన్యతను చాటడానికే
ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఎంబసీ ప్రకటన పేర్కొంది.
లష్కరే తయ్యబా వందల మంది
భారతీయపౌరులు, ఇంకా మరెంతో మంది హత్యలకు కారణంగా నిలిచిందని ఇజ్రాయెల్
వ్యాఖ్యానించింది. ‘‘2008 నవంబర్ 26న లష్కర్-ఎ-తయ్యబా పాల్పడిన హీనమైన ఘోరాలు శాంతిని
కోరుకునే అన్ని దేశాలూ సమాజాల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ముంబై
దాడుల్లో చనిపోయిన ప్రజలందరికీ ఇజ్రాయెల్
ప్రభుత్వం నివాళులర్పిస్తోంది’’ అని ఎంబసీ పేర్కొంది. శాంతియుత ప్రపంచాన్ని తీర్చిదిద్దే
క్రమంలో భారతదేశానికి అండగా నిలుస్తామని ప్రకటించింది.