ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గేందుకు పలు పార్టీలు మహిళా ఓటర్లే లక్ష్యంగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ మహిళా ఓట్లు కొల్లగొట్టేందుకు మేనిఫెస్టో విడుదల (Rajastan Congress Manifesto) చేసింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతోపాటు, మహిళలకు సంవత్సరానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని ప్రకటించారు. పంచాయతీ స్థాయి నియామకాల్లో కొత్త వ్యవస్థను తీసుకొస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. రైతులకు ఏటా రూ.2లక్షల వడ్డీలేని రుణం, మద్దతు ధరలకు భరోసా ఇచ్చారు.
జైపుర్లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్, పలువురు నాయకులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఇచ్చిన గ్యారంటీలకుతోడు, తాజాగా కులగణన అంశాలను చేర్చారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం తీసుకు వస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. కాలేజీ విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇస్తామంటూ చెప్పారు. చిరంజీవి మెడికల్ బీమా పథకం ద్వారా ఇచ్చే పరిహారం రూ.25 లక్షలను రూ.50 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.15 లక్షల పరిహారం అందించే బీమా పథకానికి కూడా మేనిఫెస్టోలో చోటు కల్పించారు.
ఈ నెల 25న రాజస్థాన్లోని 200 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.