Threat to Hindu Temple,
Canada MP concerns
కెనడాలోని సర్రే ప్రాంతంలో లక్ష్మీనారాయణ
మందిరం దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారులు గొడవ చేసిన వీడియోక్లిప్‌ను ఆ దేశపు పార్లమెంటులో
భారత మూలాలు కలిగిన ఎంపీ చంద్ర ఆర్య విడుదల చేసారు. అందులో ఖలిస్తానీవాదులు ఆ గుడి
దగ్గర సమస్యలు కలిగిస్తామని చెబుతున్నారు. ఆ వివాదంపై స్పందించి, తక్షణ చర్యలు
తీసుకోవాలని అధికారులను కోరారు.
ఎక్స్ సోషల్ మీడియాలో చంద్ర ఆర్య ఆ
వీడియో షేర్ చేసారు. ‘‘ఖలిస్తానీ వాదులు గతవారం సర్రేలో గురుద్వారా బైట ఒక సిక్కు
కుటుంబాన్ని దారుణంగా దూషించారు. అదే ఖలిస్తానీ వాదుల గుంపు ఇప్పుడు హిందువుల
లక్ష్మీనారాయణ మందిరం దగ్గర సమస్యలు సృష్టించాలని భావిస్తున్నట్టున్నారు’’ అని
ఎంపీ రాసారు.
‘‘వాళ్ళు ఇదంతా భావప్రకటనా స్వేచ్ఛ పేరిట
చేస్తున్నారు. నేను ఈ విషయం గురించి పదేపదే అడిగాను, ఇప్పుడు కూడా కెనడా అధికారులు
రంగంలోకి దిగి, తగిన చర్యలు తీసుకోవాలని మళ్ళీ అడుగుతున్నాను’’ అన్నారు ఎంపీ చంద్ర
ఆర్య.
‘‘గత రెండేళ్ళలో ఇక్కడ హిందూ దేవాలయాలపై
ఎన్నో దాడులు జరిగాయి. హిందూ ఆలయాలనే లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారు.
హిందూ-కెనెడియన్ల పట్ల ద్వేషనేరాలు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి చర్యలు బహిరంగంగా,
ప్రజల మధ్య జరగడాన్ని ఉపేక్షించడం ఆమోదయోగ్యం కాదు’’ అని కెనడా పార్లమెంటు సభ్యుడు
వ్యాఖ్యానించారు.
గత రెండేళ్ళలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడాలో ఈ ఆగస్టులో ఒక హిందూ దేవాలయంపై దాడి చేసి ధ్వంసం
చేసారు. ఏప్రిల్‌లో ఒంటారియోలోని స్వామి నారాయణ్ మందిరంలో భారత వ్యతిరేక రాతలు
రాసారు. ఫిబ్రవరిలో మిసిసాగా రామాలయంలోనూ అలాగే చేసారు. అక్కడ కొన్ని విగ్రహాలను
సైతం పాడుచేసారు. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఆ అకృత్యాన్ని ఖండించారు. ఆ
ఘటనకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కెనడా అధికారులను కోరారు. జనవరిలో
బ్రాంప్టన్‌లోని గౌరీశంకర దేవాలయంలో భారత వ్యతిరేక రాతలు రాసారు. అక్కడి భారతీయులు
ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. అలాంటి చర్యలు కెనడాలోని భారతీయుల మనోభావాలను
దెబ్బతీసాయంటూ టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడా
కేంద్రంగా భారతదేశంపై విద్వేష చర్యలకు పాల్పడుతుండడం ఆందోళనకరంగా మారింది. అయితే
వారికి వత్తాసు పలుకుతున్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వం హిందూ దేవాలయాలపై దాడుల పట్ల
ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.