ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల (israel hamas war) యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో తాము సంధి ఒప్పందం చేసుకోవడానికి దగ్గరవుతున్నామని హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియే మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడులు చేసి 1200 మందిని చంపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ హమాస్ చెరలో 240 మంది పలు దేశాల పౌరులు బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి చేసి, బందీలను విడిపించేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ సమయంలో హమాస్ చీఫ్ చేసిన ప్రకటన యుద్ధానికి తాత్కాలిక ముగింపు పలికేలా కనిపిస్తోంది.
గత 44 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 13500 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరువర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు ఖతార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తే కొంత మంది బందీలను విడిపించే ప్రక్రియ ముందుకు సాగే అవకాశముందని ఖతార్ ప్రధాని తెలిపారు.
తాత్కాలిక కాల్పుల విరమణ అంశాన్ని మధ్యవర్తులు ప్రతిపాదించారు. ఇందుకు ఇజ్రాయెల్ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. చర్చలు తుది దశలో ఉన్నాయని కూడా అమెరికా ప్రకటించింది. చర్చలు ఫలిస్తే బందీలతోపాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 300 మంది పాలస్తీనియన్లకు కూడా విముక్తి లభించే అవకాశముందని భావిస్తున్నారు.