స్కిల్ స్కాంలో (skill scam) మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నవంబరు 17న వాదనలు ముగిశాయి.న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ తీర్పును వెలువరించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ పక్షాన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.
కొందరు రాజకీయ పెద్దల ఆదేశాల ప్రకారం సీఐడీ నడుస్తోందని చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పోలీసులు చట్టాలకు విధేయులై ఉండాలని, కొందరు రాజకీయ నేతలకు కాదని వాదించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతిపక్షాలపై సీఐడీ దురుద్దేశపూర్వకంగా, తప్పుడు కేసులు నమోదు చేసిందని, స్కిల్ కేసులో పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.