ఉత్తరకాశిలోని
సిల్కియారా సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకుపోయిన 40
మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా
ప్రయత్నిస్తున్నారు.
నవంబర్ 12న ఈ ఘటన జరగగా 40 మంది కార్మికులు 216 గంటలుగా
సొరంగంలోనే చిక్కుకుపోయారు.
డ్రిల్లింగ్ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడకుండా కాపాడేందుకు
కాంక్రీట్ బ్లాక్స్‌ను ఉపయోగించారు. నిన్న రాత్రి 10 గంటలకు ఆగర్ మిషన్ తో డ్రిల్లింగ్ పనులను పునః
ప్రారంభించారు. కొండచరియలు విరిగిపడకుండా కాంక్రీట్ వేశారు. సొరంగంపై డ్రిల్లింగ్
వేసేందుకు తాత్కాలికంగా రహదారి వేస్తుండగా ఆ పనులు చివరి దశలో ఉన్నాయి.
సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ, సీఎం ధామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా
తీశారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని సాయాలను
కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పినట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.
కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారంతో సహాయ చర్యలు కొనసాగించాలని సూచించినట్లు
తెలిపింది. కార్మికులు ధైర్యం
కోల్పోకుండా భరోసా కల్పించాలని
చెప్పారు.
సొరంగ తవ్వకాల్లో ప్రపంచ ప్రఖ్యాత నిష్ణాతుడిగా పేరున్న ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ సంఘటనా స్థలానికి
చేరుకున్నారు. రెస్యూ టీమ్ కు సలహాలు సూచనలు అందజేస్తున్నారు. ప్రస్తుతం తీసుకున్న
చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.