విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని పమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఓ బోటులో చెలరేగిన మంటలు క్రమంగా విస్తరించాయి. ఈ ప్రమాదంలో 40కుపైగా బోట్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.4 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. బోట్లలో నిద్రిస్తోన్న మత్స్యకారులు చిక్కుకుని ఉంటారని మొదట ఆందోళన వ్యక్తమైంది. కాలిపోయిన బోట్లలో ఎవరూ లేరని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఫిషింగ్ బోట్లలో ఉపయోగించే నిల్వ చేసిన డీజిల్ డబ్బాలను మంటలు అంటుకుని శరవేగంగా వ్యాపించాయని అనుమానిస్తున్నారు.