రాష్ట్రంలో అరాచక, విద్వేషపూరిత పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందరేశ్వరి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మండల, పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల సభ్యుల సమావేశంలో పాల్గొన్న పురందరేశ్వరి, కార్యకర్తలకు
దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ విధానాలు తప్పుబడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని
వైసీపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో పోలీసుల
వేధింపులతో ఎస్సీ యువకుడు పురుగుమందు తాగిన ఘటనను పురందరేశ్వరి ప్రస్దావించారు. రాష్ట్ర
హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ యువకుడు
పురుగుల మందు తాగి చనిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకునే జగన్ ఆ
కుటుంబానికి ఏమి న్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి,
అక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా
ప్రచారం చేయాలని సూచించారు. పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకుంటేనే
ప్రత్యర్థులుకు దీటుగా రాజకీయం చేయగల్గుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి
ప్రణాళికాబద్ధం కృషి చేస్తున్నామన్నారు.
అమరావతి రాజధాని అనే మాటకు బీజేపీ కట్టుబడి ఉంది
.రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ఇస్తూ అరుణ్ జైట్లీ ఆనాడు ప్రకటించిన విషయాన్ని రైతులకు
గుర్తుచేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి ప్రాంతంలో ఏర్పాటైన కేంద్ర
సంస్థలు గురించి ఆ ప్రాంత అభివృద్ధికి చేస్తోన్న సాయం గురించి ప్రజల్లో చర్చ
జరిగేలా చూడాలని సూచించారు. కేంద్ర సాయం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం
వినియోగించుకోవడం లేదన్నారు.