తిరుచానూరు
శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరిగాయి. తిరుమలేశుడు అమ్మవారికి
సారె పంపిన క్రతువు అత్యంత కనులవిందుగా జరిగింది. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి
పంపిన సారెను, టీటీడీ చైర్మన్, ఈవో, వైదిక సిబ్బంది అమ్మవారి సన్నిధికి చేర్చారు.
తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి సారెను భక్తులు దర్శించి
హారతులిచ్చారు.
కార్తిక
బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమీతీర్థం కావడంతో పద్మ సరోవరంలో అమ్మవారికి
చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పంచమీతీర్ధానికి
తన దేవేరి శ్రీపద్మావతి దేవికి తిరుమల నుంచి దేవదేవుడు తరఫున ముత్తైదువు సారె
అందించడం ఆనవాయితీ. జీయ్యర్ స్వాముల సమక్షంలో పట్టుచీర, పసుపు, చందనం, కుంకుమ,
బంగారు తిరువాభరణాలు, అన్నప్రసాదాలతో టీటీడీ పాలకమండలి సభ్యులు, సిబ్బంది
తిరుచానూరు చేరుకున్నారు.
శ్రీ
సిరుల తల్లికి రేపు పుష్పయాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు పుష్పయాగం నిర్వహించడం ఆచారంగా వస్తోంది.
సాయంత్రం 5గంటల నుంచి 8 గంటల వరకు దాతలు సమకూర్చిన దాదాపు నాలుగు టన్నుల పుష్పాలు,
పత్రాలతో పుష్పయాగం నిర్వహించనున్నారు.