మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో
ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం మూడు
గంటల కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 60.52 శాతం
మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 45.40 శాతం మంది ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ అధికారులు ప్రకటించిన వివరాలు ప్రకారం, అగర్ మల్వాలో 69.96 శాతం ఓటింగ్ నమోదు
కాగా, అలిరాజ్ పూర్ లో 50.66 శాతం మంది సాయంత్రం మూడు గంటల సమయానికి ఓటు వేశారు.
అనుప్పుర్ లో 62.47 శాతం, బీటుల్ లో
63.66 శాతం, బోపాల్ లో 45.34 శాతం, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమలనాథ్ పోటీ
చేస్తున్న ఛింద్వారలో 67 శాతం పోలింగ్ జరిగింది.
42 వేల పోలింగ్
స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కు అవకాశం కల్పించిన ఎన్నికల అధికారులు, పోలింగ్
సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు
లక్షల మంది పోలీసు సిబ్బంది తో పాటు 700 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల ప్రక్రియలో
కీలక పాత్ర పోషించారు.
230 అసెంబ్లీ స్థానాల
నుంచి 2,500 మంది అభ్యర్థులు పోటీ చేశారు. డిసెంబర్ మూడున ఓట్ల లెక్కింపు చేపట్టి
ఫలితాలు వెల్లడించనున్నారు.
ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న రెండో విడత
ఎన్నికల్లో సాయంత్రం మూడు గంటల సమయానికి
55.31 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ఓటింగ్ సాగింది. నక్సల్ ప్రభావిత గరియాబంద్ జిల్లా బింద్రనవాగఢ్ నియోజకవర్గంలోని
పలు ప్రాంతంలో పోలింగ్ మధ్యాహ్నం 3 వరకే కొనసాగింది.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. తొలి విడతలో 20 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
మిగిలిన 70 స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి
భూపేశ్ బఘేల్.. తన సొంత నియోజకవర్గమైన పాటన్లోని కురుద్దీ గ్రామంలో ఓటు హక్కు
వినియోగించుకున్నారు. 75కు పైగా సీట్లు గెలుస్తామని ఆయన
విశ్వాసం వ్యక్తం చేశారు.