కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా
జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC-2023) టోర్నీ సెకండ్ సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుపై ఆస్ట్రేలియా
విజయం సాధించింది. మ్యాచ్లో ఆసీస్ 3
వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. 213 పరుగుల లక్ష్యాన్ని
కాపాడుకునేందుకు సఫారీ జట్టు పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు.
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంతవరకు ఫైనల్ చేరని
దక్షిణాఫ్రికాకు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ మాత్రమే ఎనిమిదోసారి పైనల్ కు చేరింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యం స్వల్పమే
అయినప్పటికీ విజయం కోసం కంగారూ జట్టు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్కోరు
పెద్దగా లేకపోయినప్పటికీ, దక్షిణాఫ్రికా బౌలర్లు ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్
కాగా, ఆసీస్ 47.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215
పరుగులు చేసి విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో
ట్రావిస్ హెడ్ 62, డేవిడ్ వార్నర్ 29,
స్టీవ్ స్మిత్ 30,
లబుషేన్ 18, జోష్ ఇంగ్లిస్ 28,
స్టార్క్ 16 (నాటౌట్), పాట్ కమిన్స్ 14 (నాటౌట్) పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 2, షంసీ 2,
రబాడా, మార్ క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు.
ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ లోని
నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.