ఏపీలో ప్రసిద్ద ఆలయాల ఈవోల బదిలీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆజాద్‌ను శ్రీకాళహస్తి ఈవోగా(srikalahasti temple) బదిలీ చేసి, నూతనంగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న కేవీ సాగర్‌బాబును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా సాగర్ బాబును నియమించారు.
దేవాదాయ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆజాద్‌ను గత మార్చి నెలలో అన్నవరం ఈవోగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరవాత తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. వివాదాలు ముదరడంతో ఆజాద్‌ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆజాద్ కన్నా చిన్న కేడర్‌లో ఉన్న రామచంద్రమోహన్‌ను నియమించడం మరో వివాదానికి దారితీసింది.