వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో బాగంగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గతం మాదిరే పేలవ ప్రదర్శనకు పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఎలాంటి మేలు దక్కలేదు. ఓపెనర్లు ఆరు ఓవర్లు కూడా ఆడలేకపోయారు.49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.
తొలి ఓవర్ లోనే కెప్టెన్ తెంబా బవుమా, డక్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. హాజిల్ వుడ్ వేసిన 5.4 బంతికి కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. 14 బంతులు ఎదుర్కుని మూడు పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక 10.5 బంతికి మార్కరమ్ కూడా పెవిలియన్ కు చేరాడు. 12వ ఓవర్ చివరి బంతికి డసెస్ ఔటయ్యాడు. భారీ షాట్ కు యత్నించి స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు నష్టపోయి 28 పరుగులు మాత్రమే చేసింది. స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2 వికెట్లతో సఫారీ టాపార్డర్ పనిబట్టారు.
14 ఓవర్ల తర్వాత డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా చిరుజల్లులు పడ్డాయి. దీంతో మ్యాచ్ కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఆటను తాత్కాలికంగా నిలిపివేసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 44 పరుగులు చేసింది. 20 ఓవర్లలో సఫారీ జట్టు 67 పరుగులు చేసింది. 30.4 బంతికి హెన్రిచ్ క్లాసెన్ (47) బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన జాన్సన్ తర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 119 పరుగుల వద్ద సఫారీ జట్టు ఆరో వికెట్ నష్టపోయి కష్టాల్లో కూరుకుపోయింది.
డేవిడ్ మిల్లర్ 70 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. మ్యాక్స్వెల్ వేసిన 32 ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ చేశాడు. 32 ఓవర్లకు స్కోరు బోర్డు 125 పరుగులకు చేరింది. నానా తంటాలు పడుతూ 40 ఓవర్లకు 156 రన్స్ చేయగల్గారు. కమిన్స్ వేసిన 43.3 బంతికి కోయెట్జీ(19) క్యాచ్ ఔట్ అయ్యాడు. 44 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ కు రిఫరీగా జవగళ్ శ్రీనాథ్ వ్యవహరించారు. 49.4 ఓవర్లకు దక్షిణాఫ్రికా 212 పరుగులు చేసి ఆలౌటైంది. 213 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది.