రైళ్లలో మంటలు కలకలం రేపుతున్నాయి. నిన్నటి ఘటన మరువక ముందే మరో రైల్లో మంటలు (Train Fire Accident) చెలరేగాయి. ఉత్తరప్రదేశ్లోని ఇటావా నుంచి బిహార్ వెళుతోన్న దర్భంగా రైల్లో మంటలు కలకలం రేగాయి. అగ్ని ప్రమాదంలో ఎ-6 బోగీ కాలిపోయింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.
ఘటన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని పోలీసులు తెలిపారు. గాయపడిన 21 మంది ప్రయాణీకులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరిని సైఫాయ్ ఆసుపత్రికి, మరికొందరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
బుధవారంనాడు ఢిల్లీ నుంచి బిహార్ వెళుతోన్న దర్భంగా ఎక్స్ప్రెస్లో ఎస్- 1 బోగీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. మంటలు మూడు బోగీలకు వ్యాపించాయి. ఎనిమిది మంది గాయపడ్డారు. వరుసగా రెండు ఘటనలు జరగడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.