ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులపై చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ దళాలు (israel hamas war) విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఆస్పత్రి కింద సొరంగంలో హమాస్ కమాండ్ కంట్రోల్ గది ఉందని వెలుగులోకి తెచ్చిన కొన్ని గంటల్లోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అల్ షిఫా ఆస్పత్రి భవనంలోని ఎంఆర్ఐ స్కాన్ చేసే భవనంలో పెద్ద ఎత్తున హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలు నిల్వ చేశారని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ గుర్తించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలను విడుదల చేసింది.
అల్ షిఫా ఆస్పత్రిలో హమాస్ ఉగ్రవాదులు నిల్వ చేసిన ఆయుధాల వివరాలతో కూడిన వీడియోను ఐడీఎఫ్ ప్రతినిధి జొనాధన్ కాన్నికస్ స్వయంగా విడుదల చేశారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గాజాలోని ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాదులు స్థావరాలుగా చేసుకున్నారని జొనాధన్ పేర్కొన్నారు. తాజాగా గుర్తించిన హమాస్ ఆయుధాగారంలో ఏకే 47, గ్రనేడ్లను గుర్తించారు.
అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు గుర్తించిన తరవాత ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. సొరంగ మార్గంలో సోదాలు చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్దం అవుతోంది. అల్ షిఫా ఆస్పత్రిని కూల్చివేయాలని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శిశువుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రోగులకు అవసరమైన మందులు తామే సరఫరా చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.