ఉత్తరాఖండ్‌లోని
ఉత్తరకాశీ జిల్లాలో సొరంగం కుప్పకూలిన ఘటనలో ఐదోరోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా
శ్రమిస్తున్నారు. దాదాపు 96 గంటలుగా కార్మికులు సొరంగంలో చిక్కుకుని
విలవిలాడుతున్నారు.
నిర్మాణ
పనులు జరుగుతున్న సమయంలో నవంబర్ 12న సొరంగం కూలింది. దీంతో 40 మంది నిర్మాణ కార్మికులు
అందులో చిక్కుకుపోయారు. అయితే వారికి సహాయ దళాలు ఆహారం, మందులు అందజేయగల్గుతున్నాయి
కానీ బయటకు తీసుకురాలేకపోతున్నాయి. వారితో
మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నాయి. వారిని రక్షించేందుకు చేస్తున్న
ప్రయత్నాలు వివరిస్తూ భరోసా కల్పిస్తున్నారు.
అమెరికన్
ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు
చేరవేశారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి
రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. వీటిని
అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభించి కార్మికులను ఒడ్డన
పడేసేందుకు శ్రమిస్తున్నారు.
డ్రిల్లింగ్ చేసిన తర్వాత పెద్ద స్టీల్ పైపులు దింపి వాటి
నుంచి కార్మికులను బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే నిన్న చేపట్టిన సహాయ
చర్యలకు ఆటంకం ఏర్పడింది. మళ్లీ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
దీంతో పనులకు అంతరాయం ఏర్పడింది.
హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మధ్య రాకపోకలు
మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ సొరంగం తొవ్వుతున్నారు.