PM launches PM PVTG development mission
గిరిజనుల సంక్షేమం
లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ పీఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్ పథకాన్ని
ప్రారంభించారు. ప్రముఖ గిరిజన స్వాతంత్ర్య పోరాటయోధుడు బిర్సాముండా జయంతి
సందర్భంగా జార్ఖండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి 24వేల కోట్ల విలువైన ఈ పథకాన్ని
ఖుంటీ జిల్లాలో ప్రారంభించారు.
బిర్సాముండా జయంతిని
కేంద్రప్రభుత్వం జనజాతీయ గౌరవదినంగా 2021లో ప్రకటించింది. అప్పటినుంచీ ఆరోజు జాతీయ
ఉత్సవం జరుపుతున్నారు. ఆ క్రమంలో భాగంగానే మోదీ ఇవాళ జార్ఖండ్లో పర్యటించారు.
ప్రధానమంత్రి అత్యంత బలహీన గిరిజన బృందాల అభివృద్ధి (పీఎం పీవీటీజీ) పథకాన్ని
ఆవిష్కరించారు. ఈ పథకం కింద 18 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో 220 జిల్లాల్లో
22,544 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 28 లక్షల మంది గిరిజనులకు 75 పీవీటీజీల
ద్వారా లబ్ధి చేకూరుతుంది.
ఈ పథకంతో పాటు
ప్రధాని మోదీ ‘వికసిత భారత సంకల్పయాత్ర’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ
సంతృప్త స్థాయిలో అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. కేంద్ర పథకాల లబ్ధిదారులు
అందరికీ ఆయా పథకాల గురించి వివరించి అవగాహన కల్పించడం ఈ యాత్ర లక్ష్యం అని మోదీ
వెల్లడించారు.
ఈ సందర్భంగా
మోదీ జార్ఖండ్లో 7200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
చేసారు, జాతికి అంకితం చేసారు. అలాగే, పీఎం కిసాన్ పథకం 15 దఫా నిధులు 18వేల
కోట్లు విడుదల చేసారు. రైతులకు యేటా మూడు విడతల్లో ఆరువేల రూపాయలు అందించే ఈ పథకం
కింద ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 11కోట్ల మందికి పైగా రైతులకు 2.61 లక్షల కోట్ల
నిధులు ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో అందించారు.
మోదీ ఈ ఉదయం జార్ఖండ్ రాంచీలో బిర్సాముండా స్మారక ఉద్యానవనాన్ని, మ్యూజియంను
సందర్శించి ఆ స్వాతంత్ర్యసమర వీరుడికి నివాళులర్పించారు. ఆ తర్వాత బిర్సాముండా
జన్మించిన ఉలిహటు గ్రామాన్ని సందర్శించారు. బిర్సాముండా గ్రామాన్ని దర్శించిన
మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయే. ఆ పర్యటనలో ప్రధానితో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్
సోరెన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, జార్ఖండ్ గవర్నర్ సీపీ
రాధాకృష్ణన్ పాల్గొన్నారు.